కరీంనగర్ జిల్లాలో భారీస్థాయిలో గుట్కా పాకెట్లు తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. జమ్మికుంట గ్రామీణ సీఐ రాములు ఆధ్వర్యంలో పోతిరెడ్డిపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో రెండు కార్లను గుర్తించిన పోలీసులు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాటి విలువ సుమారు రూ.9.40 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వీణవంక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులు రెండు కార్లలో గుట్కాను వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుట్కా తరలించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని హుజురాబాద్ ఏసీపీ అభినందించారు.