"నువ్వు ఎవరిని అడగాలి.. డబ్బులు ఎవరిని అడగాలి... మీ నాన్నకు చెప్పు.. ఇక్కడకు రావటానికి వీలులేదని... ఏంటి హీరో అయిపోయావా నువ్వు?".. అంటూ విద్యార్థిపై చేయి చేసుకున్నాడో ప్రధానోపాధ్యాయుడు.
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగు తుని గ్రామానికి చెందిన.. రూపేష్ గ్రామంలోనే ఎనిమిదో తరగతి వరకు చదివాడు. తొమ్మిదో తరగతి నర్సింగబిల్లిలో చదువుతున్నాడు. 8, 9 వ తరగతులకు సంబంధించిన అమ్మ ఒడి నగదు అతనికి ఇంకా రాలేదు. ఏనుగు తుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మని అడగ్గా.. ఆయన వీరావేశంతో విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులను అడగకుండా తనను ఎందుకు అడుగుతున్నావని విద్యార్థి చెంప చెళ్లుమనిపించారు. అతని తండ్రిని తన వద్దకు రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అయితే.. 'నేను చెప్తే ఆయన వినరు.. మీరే చెప్పండి' అని.. ఆ విద్యార్థి చెబుతున్నా ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోలేదు. ఓ దశలో మెడ పట్టుకుని మరీ చెంపలు వాయించారు. ఈ దృశ్యాలు.. వైరల్ అయ్యాయి.
ప్రధానోపాధ్యాయుడి వివరణ ఏంటంటే...
ఘటనపై ప్రధానోపాధ్యాయుడు శర్మను వివరణ కోరగా.. "విద్యార్థి రూపేష్, అతని అన్నయ్యకు వేర్వేరు బ్యాంకు ఖాతాలు ఇవ్వడం వల్లే నగదు జమ కాలేదు" అని వివరణ ఇచ్చారు. ఒకే బ్యాంకు అకౌంట్ ఇవ్వాలని విద్యార్థి తండ్రి దుర్గారావుకు చెప్పామన్నారు. "దుర్గారావు మద్యం సేవించి వచ్చాడు. నా వల్లే అమ్మ ఒడి నగదు రాలేదని దురుసుగా మాట్లాడాడు. అంతే కాదు... విద్యార్థి రూపేష్ సైతం అమర్యాదగా మాట్లాడాడు. అందుకే మందలించాల్సి వచ్చింది" అని ప్రధానోపాధ్యాయుడు చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: పేటీఎం నుంచి డబ్బులు చెల్లించమంటున్నారా..?