ఎలాంటి పత్రాలు అవసరం లేకుండా అప్పటికప్పుడే రుణాలిచ్చి... తర్వాత వేధింపులకు దిగుతున్న నిర్వాహకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వేధింపులకు పాల్పడుతున్న వారిని హైదరాబాద్, వరంగల్ పోలీసులు ఇప్పటివరకు 30 మందిని అరెస్టు చేశారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ముగ్గురిని, వరంగల్ పోలీసులు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా దేశస్థులు ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి మోసపూరిత యాప్‌ల వెనక చైనీయుల పాత్రపై... పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.
తెలియకుండానే ఇచ్చి
ఉప్పల్‌కు చెందిన భూమన ప్రసాద్... మై బ్యాంక్ అనే యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తిరిగి కట్టి మరోసారి కూడా రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత తన ప్రమేయం లేకుండా మరో 14 యాప్‌ల నుంచి 26 వేలు తన ఖాతాలో జమ అయ్యాయి. 7 రోజుల తర్వాత... డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. దీనిపై బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితునికి వచ్చిన కాల్స్ ద్వారా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.... పూణే కేంద్రంగా కాల్ సెంటర్ నడుస్తున్నట్లు గుర్తించారు. జియా లింగ్ పేరుతో పరుశురాం అనే వ్యక్తి కాల్ సెంటర్‌ను నడిపిస్తున్నట్లు గుర్తించి కార్యాలయంపై దాడులు నిర్వహించారు.
ల్యాప్‌టాప్‌లు, చరవాణులు స్వాధీనం
ముంబయి, కర్ణాటకలోని పలు కంపెనీలతో జియా లింగ్ కాల్ సెంటర్ ఒప్పందం చేసుకుంది. రుణం తీసుకున్న వారికి ఫోన్‌లు చేయడం... రకరకాలు వేధించడం వీరి పని. పలు రకాల లోన్ యాప్‌లకు వీరు సేవలు అందిస్తున్నారు. ఈ సంస్థలో మొత్తం 30 మంది తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరుశురాంతో పాటు అతని భాగస్వాములు అయిన భార్య లియాంగ్ టియాన్ టియాన్, షేక్ ఆకిబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 101 లాప్‌టాప్‌లు, 106చరవాణులు, సీసీటీవీ కెమెరాల డీవీఆర్లు, పలు కంపెనీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వరంగల్‌లో ముగ్గురిని
వరంగల్ పోలీసులు బెంగళూరులో ముగ్గురిని అరెస్టు చేశారు. జనగామకు చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. చైనాకు చెందిన ఓ వ్యక్తి... ఒడిశావాసితో కలిసి 4 ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లను రూపొందించి... వేధింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రజలు ఈ తరహా లోన్ యాప్‌లకు దూరంగా ఉండాలని సూచిస్తూ... వరంగల్ పోలీసులు వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్ పేరు వాడుకుని మోసం చేయాలనుకుని...