మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలోని బోర్డును జేసీబీతో తొలగించి.. భూమిని చదును చేసిన సీసీటీవీ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సర్వే నెంబర్ 314, 315లోని నాలా బఫర్ జోన్లో ఉన్న స్థలాన్ని ఓ నాయకుడు కబ్జాకు యత్నించారు. గతంలో ఓ సారి ఆ భూమిలో ఏర్పాటు చేసిన 'ప్రభుత్వ స్థలం' బోర్డును తొలగించారు. అక్కడ ఓ కంటైనర్ డబ్బాను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేయబోయారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. ఫెన్సింగ్ వేయకుండా అడ్డుకున్నారు. డబ్బాను తొలగించి అక్కడ ప్రభుత్వ భూమి బోర్డును మళ్లీ ఏర్పాటు చేశారు. సదరు కబ్జారాయుళ్లు కొన్నిరోజులు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. అయితే గత నెలలో కొంత మంది తిరిగి ఓ జేసీబీతో ఆ బోర్డును తొలగించి.. భూమిని చదును చేసిన సీసీటీవీ విజువల్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.
తప్పుడు పత్రాలతో ఆ భూమి చుట్టూ ప్రహరి నిర్మించడానికి అనుమతి పొందారని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. అనుమతిని రద్దు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో నేడు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా ప్రభుత్వ బోర్డు లేదు. ఆ భూమి చదును చేసి ఉండగా.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...