గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసుల్లో సాక్షుల విచారణ ప్రక్రియ తుది దశకు చేరింది. ఓఎంసీ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి... న్యాయాధికారికి ముడుపులు ఇచ్చి బెయిల్ పొందారన్న అభియోగంపై అనిశా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ముడుపుల ద్వారా బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైనట్లు మరో కేసు కూడా విచారణ జరుగుతోంది. రెండు కేసుల్లో ఇద్దరు అధికారులు మినహా సాక్షులందరి వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తయింది.
సాక్షుల వాంగ్మూలం కోసం విచారణకు హాజరు కావాలని ఇద్దరు అధికారులకు అనిశా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ముడుపులు తీసుకొని బెయిల్ పొందారన్న కేసులో అనిశాకు ఫిర్యాదు చేసిన సీబీఐ అధికారి ఆర్ఎం ఖాన్ కూడా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో పని చేస్తున్నందున సమయం ఇవ్వాలని ప్రత్యేక పీపీ కోరారు. దీంతో జనవరి 8న హాజరుకావాలని సూచించింది. బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన మరో కేసులో ఫిర్యాదు చేసిన ఏసీబీ ఇన్స్పెక్టర్ రఘుపతి గౌడ్ జనవరి 4న విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఈనెల 31కు ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా