క్షుద్రపూజల పేరుతో మోసం...నకిలీ బాబా అరెస్టు - కర్నూలులో క్షుద్రపూజల పేరుతో మోసం
క్షుద్రపూజల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి లక్షలు కాజేస్తున్న బురిడీ బాబాను ఏపీలోని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో నిందితులపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలను క్షుద్రపూజల పేరుతో మోసం చేసి లక్షలు కాజేస్తున్న అంతరాష్ట్ర బురిడీ బాబాను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన మహ్మద్ బాషా అలియాస్ బాబా కొంత మంది వ్యక్తులతో ముఠాగా ఏర్పడి దొంగతనాలు, దోపీడీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా సభ్యుల్లో గత నెల 26న 21 మందిని, 28వ తేదీన మరో నలుగురిని, ఇవాళ ముగ్గురిని మొత్తం 28 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్భురాజన్ వెల్లడించారు.
క్షుద్రపూజల పేరుతో ఇళ్లలో పూజలు చేసి వారిని మాయలో పడేసి ఇంట్లోని నగదు, బంగారం ఎత్తుకెళ్లేవారని పోలీసులు తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలోని బళ్లారి, ఏపీలోని అనంతపురం, ధర్మవరం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ ముఠా దోపిడీలు చేసిందన్నారు. వీరిపై ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో 15 కేసులు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు. మూఢ నమ్మకాల పేరుతో ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దని ఆయన హితవు పలికారు. ఈ ముఠాలో మరికొంత మంది పరారీలో ఉన్నట్లు వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.