దా'రుణ' యాప్‌ల నిర్వాహకుల వేధింపుల కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఆన్‌లైన్ లోన్ యాప్‌లకు సంబంధించి మరో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన వారి కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో వీళ్లు రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్ పూర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సునీల్ ఆత్మహత్య కేసులోనూ ఈ రుణ సంస్థల నిర్వాహకులకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లు నిర్వహిస్తున్న సూక్ష్మరుణ సంస్థల నుంచి కూడా సునీల్ రుణం తీసుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు.
ఈ సంస్థల నిర్వాహకులు సునీల్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారా లేదా అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు రెండు రోజుల క్రితం 6మందిని అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్న నిందితులు వాళ్ల అప్లికేషన్ల ద్వారా దాదాపు లక్షమందికి పైగా రుణాలు ఇచ్చారు. ఆన్‌లైన్ సూక్ష్మరుణ సంస్థల ఆగడాలు శృతి మించడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదీ చూడండి: గుడ్‌గావ్ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..