అటవీ సంరక్షణ చర్యల్లో భాగంగా కలప కోత మిల్లులపై సంగారెడ్డి జిల్లా అటవీ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంతో పాటు రంజోల్ గ్రామాల్లోని 20 కలప కోత మిల్లుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపారు. అక్రమంగా నడుపుతున్న పది మిల్లులపై కేసులు నమోదు చేసి జప్తు చేశారు. మిల్లుల్లోని కోత యంత్రాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇటుక బట్టీల్లో కలప కాల్చడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల జరిమానా విధించారు.
కలప వ్యాపారులు సంబంధిత చట్టానికి లోబడి పనిచేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు అధికారులు. సామిల్లులకు వస్తున్న కలప ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వస్తు రూపంలోకి మారింది, ఎక్కడికి వెళ్లింది అనేవి సరైన రికార్డులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.