ఖమ్మం జిల్లా ఏన్కూరులో నకిలీ పురుగుమందులు తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.96 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు. తూతక లింగన్నపేట సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా సుబ్బారావు, లక్ష్మా అనే వ్యక్తులు నకిలీ మందులు తరలిస్తుండగా ఎస్సై శ్రీకాంత్ పట్టుకున్నారు. వారిని విచారించగా కామేపల్లి మండలం తాళ్లగూడెంకు చెందిన సురేశ్, బూడిదంపాడులో రామారావు, రాక్యాతండాలో వెంకన్న అనే పురుగుమందుల దుకాణాల యజమానులు కూడా విక్రయిస్తున్నట్లు తెలుసుకుని వారి వద్ద ఉన్న నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. రైతులు ఎక్కువగా పంటలకు పిచికారి చేసే ఖరీదైన డెలిగేట్, ట్రేసర్, కువార్జన్ అసలు మందులను పోలిన విధంగా తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
పట్టుకున్న మందుల బార్‌కోడ్ తనిఖీ చేసి... నకిలీలుగా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. పోలీసులు పట్టుకున్న డబ్బాలను ఆయా మండలాల వ్యవసాయ అధికారులకు అప్పగించినట్లు సీఐ కరుణాకర్ వెల్లడించారు. ఖమ్మంలో ఓ వ్యక్తి ఈ తరహా మందులు సరఫరా చేస్తున్నాడని విచారణలో తేలడం వల్ల ఆరా తీస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, ఖమ్మంలో విచారణ చేసి అసలు తయారు గుట్టు తేల్చే పనిలో ఉన్నామన్నారు. రైతులను మోసగించే విధంగా మందులు సరఫరా చేస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై శ్రీకాంత్‌ను ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకర్‌లు అభినందించారు.
ఇదీ చూడండి: యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. 10 ట్రాక్టర్ల పట్టివేత