భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సలాంనగర్‌లో ఓ వడ్డీ వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రుణాలు చెల్లింపులపై బ్యాంకులు సమయం ఇచ్చినప్పటికీ.. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. సలాంనగర్ గ్రామానికి చెందిన అజ్మీర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బానోతు హన్మా అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. ఇప్పటి వరకు రూ.లక్షా యాబై వేల వరకు చెల్లింపు చేశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన డబ్బుకు వడ్డీ చెల్లించడానికి కొంతకాలం ఆగాలని విజ్ఞప్తి చేశాడు. అయితే వడ్డీ వ్యాపారి వినకుండా అతడిపై దాడి చేశాడు. అజ్మీర్‌ను, అతని భార్యను తన ఇంట్లో నిర్బంధించాడు. వడ్డీ వ్యాపారి చర నుంచి బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్మడి రాజ్ కుమార్ తెలిపారు.
ఈ సంఘటనతో గ్రామాలలో అప్పులు తీసుకున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని కొంతకాలం ఆగే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు