బీమా పేరిట వాహనదారులను మోసం చేస్తున్న నకిలీ బీమా ముఠాను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ బీమా కంపెనీల పేరిట వాహనాలకు బీమా చేస్తూ వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠా నుంచి 1,125 నకిలీ బీమా పత్రాలు, 57 వేల నగదు, 3 కాలుష్య పరీక్ష వాహనాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.
నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన రమేశ్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన సాయిరాం, నల్గొండ జిల్లాకు చెందిన గోవర్ధన్ మరో 8మందితో కలిసి వాహనాలకు నకిలీ బీమా పత్రాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటు చేసుకుని అక్కడి వచ్చే వాహనదారులకు... వాహన బీమా రెండు నిమిషాల్లో ఇస్తామంటూ మాటలతో మభ్యపెట్టి.. ఒక్కో వాహనానికి రెండు నుంచి 3వేల రూపాయలు వసూలు చేస్తూ నకిలీ పత్రాలు అందజేశారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
అయితే అనుమానం వచ్చిన ఓ వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన విచారణ బృందం.. దర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేసింది. ఈ ముఠా రిలయన్స్ జనరల్ ఇన్స్‌రెన్స్, కోటాక్ జనరల్ ఇన్స్‌రెన్స్, హెడీఎఫ్‌సీ, శ్రీరామ్ జనరల్ ఇన్స్‌రెన్స్ తదితర సంస్థలకు చెందిన నకిలీ ఇన్స్‌రెన్స్ పత్రాలను వాహనదారులకు జారీ చేసింది. ఈ తరహా ముఠాల బారినపడి వాహనదారులు మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. వాహన బీమా పత్రాలు కేవలం పోస్టు ద్వారా మాత్రమే వాహనదారులకు చేరుతాయని అప్పటికప్పుడు ఇచ్చే పత్రాలను ఎవరూ నమ్మవద్దని సీపీ తెలిపారు.
ఇదీ చదవండి: భూ మాయ: మైసమ్మ తల్లి సాక్షిగా చెరువును మింగేశారు!