సైబర్ నేరస్థులు పంజా విసిరినప్పుడు బాధితుల నగదు బదిలీ జరిగిన బ్యాంకు ఖాతాలు లేదా ఈ-వ్యాలెట్ ఖాతాల ఆధారంగానే పోలీసుల దర్యాప్తు ప్రారంభమవుతుంది. తీరా ఆ ఖాతాదారులు దొరికినా డబ్బు తిరిగి రాబట్టుకోవడం అంత సులువు కాదు. జరిగిన మోసంలో ఆ ఖాతాదారులు చిన్న చేపలు మాత్రమే కావడం అందుకు కారణం. ఫలితంగా పోలీసుల దర్యాప్తు అక్కడే ఆగిపోతుంది. ఖాతాదారులకు, అసలు నేరస్థులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో అడుగు ముందుకు పడడం లేదు.
దిల్లీ, నోయిడా, కోల్‌కతా, భరత్‌పూర్.. తదితర ప్రాంతాలకు చెందిన నేరస్థులు ఈ మోసాలకు పాల్పడుతున్నా విదేశాల నుంచి వ్యవహారం నడిపించేది మాత్రం నైజీరియన్ ముఠాలే. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. సాధారణంగా బిచ్చగాళ్లు, చిరు వ్యాపారులు, ఆర్థిక అవసరాలున్న వారిని గుర్తిస్తున్నారు. వారి ఆధార్ కార్డు ప్రతులను సమర్పించి బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. ‘‘మాకు అవసరమైప్పుడు నీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ చేయించుకుంటాం.. వాటిని డ్రా చేసేప్పుడు మాత్రం నీవు బ్యాంకు వద్దకు వస్తే సరిపోతుందని వారితో చెబుతారు. డ్రా చేసిన నగదులో నుంచి 10-15శాతం కమీషన్ ఇస్తామని అని ఒప్పందం చేసుకుంటారు. ఈ క్రమంలో విదేశాల నుంచి బాధితులకు మెయిళ్లు పంపించడంతో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్ సంభాషణలు, ఫోన్‌కాల్స్ ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు.
మోసం జరిగాక సైబర్‌క్రైం పోలీసులు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల దగ్గర బినామీల చిరునామా తీసుకుంటున్నారు. ఆ చిరునామాకు వెళ్లినప్పుడు వారి వాలకం చూసి అవాక్కవుతున్నారు. వారు చిన్నచేపలే అని తెలియడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో చిల్లిగవ్వ ఉండదని నిర్ధారణ అవుతోంది. విదేశాల్లో ఉండే అసలు నేరస్థులతో వారికి సంబంధం ఉండకపోవడంతో దర్యాప్తు అక్కడితో ఆగిపోతోంది. ఉత్తరాదికి వెళ్లినా అసలు నేరగాళ్లు దొరకకపోవడంతోపాటు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో బ్యాంకు అధికారులతో మాట్లాడి ఎంతో కొంత రప్పిస్తున్నారు. ఏపీలోని విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు బాధితులు పొగొట్టుకున్న రూ.1.4కోట్లలో 52.66 శాతాన్ని తిరిగి ఇప్పించారు.
ఇదీ చూడండి. లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం