డెబిట్ కార్డులు.. క్రెడిట్ కార్డులు.. పేటీఎం.. గూగుల్ పే ఖాతాల్లోంచి నగదు కొట్టేస్తున్న సైబర్ నేరస్థులు మరో కొత్త పంథాలో నేరాలకు తెరతీశారు. పాన్‌కార్డుల వివరాలు సేకరించి వాటికి నకళ్లు తయారు చేసి ఫైనాన్స్ సంస్థల నుంచి రూ. లక్షల్లో రుణాలు తీసుకుంటున్నారు. తన పాన్‌కార్డును ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు రూ. 60వేలు అప్పు తీసుకున్నారంటూ సికింద్రాబాద్ చెందిన పాండే పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు ప్రాథమిక ఆధారాలను సేకరించగా.. కొద్దినెలల నుంచి దిల్లీ, ముంబయిలలో ఉంటున్న సైబర్ నేరస్థులు బ్యాంకుల నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకుని వారి పాన్‌కార్డుల నకళ్లు తయారుచేసి రుణాలు తీసుకుంటున్నారని తేలింది.
పాన్‌కార్డుల క్లోనింగ్..
బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు దిల్లీ, ముంబయిలలో ఉంటున్న కొందరు సైబర్ నేరస్థులు పాన్‌కార్డులను క్లోనింగ్ చేస్తున్నారని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు... 48గంటల్లో రుణాలిస్తామన్న జాతీయ, కార్పొరేటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ప్రకటనలను సైబర్ నేరస్థులు అవకాశంగా మలుచుకున్నారని చెబుతున్నారు. పాన్‌కార్డుతో అనుసంధానమైన జాతీయ, కార్పొరేటు బ్యాంకుల ఖాతాదారుల వివరాలను పొరుగుసేవల విభాగాల నుంచి సేకరిస్తున్నారని, అనంతరం పాన్‌కార్డుల నంబర్లను తీసుకుని సిబిల్ స్కోర్ తెలుసుకున్నాక మాయాజాలం ప్రదర్శిస్తున్నారని తెలిపారు.
క్లోనింగ్ పాన్‌కార్డులను తయారు చేసి తమ ఫొటోలను వాటిపై అతికించి రుణాలు తీసుకుంటున్నారని తెలిపారు. తమ ఖాతాలున్న బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం, ఆన్‌లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసేందుకు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుండటంతో చాలా మంది బాధితులకు తమ పాన్‌కార్డులు దుర్వినియోగమవుతున్నాయన్న విషయం తెలియదన్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: బల్దియా ఖజానా ఖాళీ.. జీతాల చెక్కులు వెనక్కి