రుణాలిచ్చేందుకు చైనా కంపెనీలు పెట్టుబడులను ఏ రూపంలో పెట్టారని పరిశోధిస్తుండగా.. ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరు నెలల్లో రూ.25 వేల కోట్ల లావాదేవీలు నిర్వహించిన ఈ కంపెనీలు రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. దిల్లీ కేంద్రంగా సాగుతున్న కొన్ని బ్యాంకింగేతర రుణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇదంతా చేశారు. ఏఏ సంస్థలతో ఎంతకు ఒప్పందం కుదుర్చుకున్నాయన్న అంశాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.
భారత్‌కు వచ్చేప్పుడే కార్యాచరణ
రుణాలివ్వడం ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టవచ్చన్న అంచనాతో గతేడాది జనవరిలో జెన్నీఫర్, జియాంగ్ షి, మరో ఇద్దరు చైనీయులు భారత్‌కు వచ్చారు. ముందే కార్యాచరణ రూపొందించుకున్నారు. భారతీయులను డైరెక్టర్లుగా నియమించి కంపెనీలను ప్రారంభించారు. ఆరు కంపెనీలను ఆరంభించిన అనంతరం 250 కిపైగా యాప్‌లను సృష్టించారు. సులభంగా వ్యక్తిగత రుణాలు పొందండి.. స్వల్ప వ్యవధిలో అప్పు తీర్చండి అంటూ వాట్సాప్ ద్వారా చరవాణులకు సంక్షిప్త సందేశాలను పంపించి కోట్ల మందికి రుణాలిచ్చారు. ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై యాప్‌ల ద్వారా రుణాలిచ్చారు. ఎక్కువగా యువకులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, చిరు వ్యాపారులు ఉన్నారు. పూచీకత్తు లేకుండా ఇస్తుండడంతో విందులు, వినోదాలతోపాటు బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ రమ్మీ ఆడేందుకు రుణాలు తీసుకున్నారు.
అప్పులు.. వసూలు బాధ్యత మాదే
దిల్లీలోని కొన్ని బ్యాంకింగేతర రుణ సంస్థలను చైనా కంపెనీలు సంప్రదించాయి. రుణాలిచ్చేందుకు అర్హులైన వారిని ఎంపిక చేస్తామని, నెల రోజుల్లో వసూలు చేసిస్తామని, పదిహేను శాతం వడ్డీతో ఇస్తామంటూ చైనా కంపెనీల ప్రతినిధులు బ్యాంకింగేతర రుణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారు ఎగవేస్తే.. తమదే బాధ్యత అని, మూడు నెలలకోసారి రుణాల వ్యవహారాలపై చర్చించుకుని బ్యాంకింగేతర సంస్థకు అసలుతోపాటు 15 శాతం వడ్డీ రానట్లైతే ఆ మొత్తాన్ని తాము సర్దుబాటు చేస్తామని ఒప్పందంలో పేర్కొన్నారు. రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకున్న వారిలో 40 శాతానికిపైగా సక్రమంగా కిస్తీలు చెల్లించడం లేదు. దీంతో చైనా కంపెనీల ప్రతిపాదనలను అంగీకరించిన రుణ సంస్థలు చైనా కంపెనీలు సూచించిన వారి ఖాతాల్లో నగదు జమ చేశాయి. వీరికి పదిహేను శాతం వడ్డీ ఇస్తామని చెప్పిన చైనా కంపెనీలు యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న వారి నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేసుకున్నాయి.