కరోనా భయంతో దంపతులు ఉరివేసుకొని బలవన్మరణం చెందిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని శివవీధిలో నివసించే గంజి రాంబాబు (45)కు మూడు రోజులక్రితం కరోనా సోకగా గురువారం ఉదయం అతని భార్య లావణ్య (40)కు పాజిటివ్‌గా తేలింది. దీంతో లావణ్య చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉన్న తన తల్లిదండ్రులు, సోదరుడికి ఫోన్ చేసి తమకు కరోనా పాజిటివ్ వచ్చిందని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పారు.
వారు సాయంత్రం ఆస్పత్రికి వచ్చే సరికి రాంబాబు, లావణ్య రాలేదు. ఫోన్‌కూ స్పందించలేదు. అనుమానంతో రాత్రి జగిత్యాలకు వచ్చి చూడగా దంపతులిద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాంబాబు గత పదేళ్లుగా మహారాష్ట్రలో ఉంటుండగా అతని తండ్రి పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందటంతో జగిత్యాలకు వచ్చారు. కొవిడ్ నేపథ్యంలో తిరిగి మహారాష్ట్రకు వెళ్లలేదు. కరోనా సోకడం, సంతానం లేకపోవడంతో మనస్తాపం చెంది బలవన్మరణం చెందినట్లు బంధువులు భావిస్తున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులు కొవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహాలను బల్దియా సిబ్బందితో జిల్లాకేంద్ర ఆసుపత్రికి తరలించారు.