నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి తెగిపోయింది. భర్తతో కలిసి పెందోటి లక్షమ్మ... హాలియ వెళ్లి వస్తూ బంకపురం చిలుకవాగు వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి.. బ్రిడ్జికి ఉన్న తూముల్లో ఇరుక్కుని మృతి చెందింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త నర్సింహ... భార్య మరణాన్నితట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య వియోగం తట్టుకోలేక..
చనిపోయిన లక్షమ్మ స్థానికంగా ఉన్న పాఠశాలలో పని చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తోంది. ఆనందంగా సాగుతున్నకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు నిఖిత, అంజలిలు తల్లి చిన్నకర్మ కోసం ఏర్పాట్లలో మునిగిపోయారు. తండ్రి నర్సింహ భార్య లక్ష్మమ్మ చనిపోయిన నాటి నుంచి ఒక్కడే ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. లక్షమ్మ చేసే స్థానిక పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మరణవార్త విన్న కూతుళ్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
దాతలు ఆదుకోవాలి..
ప్రకృతి విపత్తుతో వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నర్సింహ తల్లిదండ్రులకు వయసు మీద పడింది. వారి ఇద్దరు కూతుళ్లు నిఖిత, అంజలి దిక్కులేని వారై అనాథలుగా మిగిలారని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి.. కబ్జాదారుల కోరల్లో పెద్ద చెరువు.. మోక్షం ఎప్పటికో!