నాలుగు నెలల క్రితం చోరికి గురైన కంప్యూటర్లు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా తనిఖీలు నిర్వహించారు. ములుగు జిల్లా పందికుంట క్రాస్‌రోడ్ వద్ద తెల్లటి సంచులు పట్టుకుని ఉండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి మానిటర్, ప్రింటర్, ప్రొజెక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
లసాని కర్ణాకర్, ముప్ప ప్రవీణ్ ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేసేవారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో చోరీకి పాల్పడ్డారు. జాకారం గ్రామ సమీపంలో ఉన్న వైటీసీ సెంటర్లో గతేడాది సెప్టెంబర్ 29న రాత్రి చొరబడి కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్స్ దొంగిలించారు. నాలుగు నెలలైనా వాటిని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈరోజు ఉదయం విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు ములుగు ఏఎస్పీ సాయి చైతన్య వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.