ఈజీ మనీ కోసం సెల్ ఫోన్ దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్న ఓ సెల్ ఫోన్ దొంగను మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్‌నగర్‌లో నివాసం ఉండే మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నెల 19న తన రూమ్‌లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్లాడు. వచ్చి చూసేరికి ఫోన్ కనిపించకుండా పోయింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దొంగపై నిఘా..
పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సెల్ ఫోన్ దొంగపై నిఘా పెట్టారు. నేడు ఉదయం ఓ వ్యక్తి 6 సెల్ ఫోన్లను షాపూర్‌నగర్ మార్కెట్లో అమ్ముతున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అక్కడికి చేరుకుని సెల్ ఫోన్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. సదరు దొంగ.. రొడామిస్త్రీ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే షేక్ మహబూబ్‌గా పోలీసులు గుర్తించారు. మహేష్ రెడ్డి సెల్ ఫోన్‌ను దొంగలించింది కూడా ఇతగాడే..!
6 తో కలిపి 35..
షేక్ మహబూబ్ గతంలో 29 సెల్ ఫోన్లు దొంగతనం చేసినట్టు తమ విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 7లక్షల 50 వేలు ఉంటుందని వెల్లడించారు. షేక్ మహబూబ్తో పాటు దొంగ సెల్ఫోన్లను కొంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని రిమాండ్‌కు పంపుతున్నామని బాలానగర్ ఏసీపీ పురుషోత్తం తెలిపారు.
అలా దొంగతనం చేసినందుకు, దొంగ ఫోన్లను కొంటున్నందుకు ఇద్దరూ కటకటాలపాలయ్యారన్నమాట.
ఇదీ చూడండి: విషాదం: వేరువేరు ఘటనల్లో ఇద్దరు యువకుల బలవన్మరణం