మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. కీలక అనుమానితులను విచారిస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటివరకు విచారించని వారిని సీబీఐ విచారణకు పిలిచి ప్రశ్నిస్తోంది. రెండో విడత విచారణలో భాగంగా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో పది మంది సీబీఐ అధికారులు... పది మంది అనుమానితులను 7 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయమే ఇద్దరు ముస్లిం మహిళలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వారితో వివేకానందరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఇతర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం.
ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ చిన్నన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. డాక్టర్ చిన్నన్నకు పులివెందులకు చెందిన సుధాకర్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నాయి. సుధాకర్ రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిచింది. అయితే వివేకా హత్య కేసులో వీరిద్దరి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారనేది చర్చనీయాంశమైంది. వివేకా ఇంట్లో పనిచేసే వారు, వారి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారిని.. ఆర్థిక లావాదేవీలు చూసేవారిని సీబీఐ క్షుణ్ణంగా విచారణ జరుపుతోంది. మధ్యాహ్నం ఐదుగురు పులివెందులకు చెందిన యువకులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వీరిలో ఇద్దరు టైలర్లు కాగా, ఇద్దరు వ్యవసాయం చేసేవారు, మరొకరు వాలంటీర్ ఉన్నారు.
కాల్ డేటా ఆధారంగా విచారణ
కాల్ డేటా ఆధారంగా వివేకాకు ఫోన్ చేసిన వారిని సీబీఐ విచారిస్తోంది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. ఆ నెలలో ఎక్కువసార్లు వివేకా మొబైల్కు ఎవరెవరు ఫోన్లు చేశారు. 15వ తేదీ ఎవరెవరూ ఫోన్లు చేశారు. ఎందుకు చేశారనే దానిపై సీబీఐ ఆరా తీస్తున్నట్లు సమాచారం. వారికున్న అనుమానం ప్రకారం పలువురు అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. ఈ లెక్కన గతంలో సిట్ అధికారులు కూడా వివేకా కేసులో 1300 మంది అనుమానితులు, సాక్షులను విచారించారు. కానీ హంతకులెవరనేది సిట్ అధికారులు కనిపెట్టలేకపోయారు.
కీలక పత్రాలు అందితే... విచారణ మరింత వేగం
వివేకా కేసులో పది మంది సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. రేపు, ఎల్లుండి మరో పదిమంది సీబీఐ అధికారులు కడపకు చేరుకునే వీలుందని తెలుస్తోంది. కేసు విచారణ ముమ్మరం చేయడానికి, అనుమానితులను వరసగా విచారణ చేయడానికి ఎక్కువ సంఖ్యలో అధికారులు రంగంలోకి దిగనున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆధారాల కోసం పులివెందు కోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. కోర్టు పరిశీలనలోనే ఉంది. కోర్టు అనుమతితో కీలక డాక్యుమెంట్లు సీబీఐకి అప్పగిస్తే.. కేసు విచారణ మరింత వేగం పెంచే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి. కేసులో కీలక అనుమానితులను సీబీఐ విచారణకు పిలిచే వీలుంది.
ఇదీ చదవండి : భయం భయం: భాగ్యనగరంలో డెత్ స్పాట్లుగా మ్యాన్ హోళ్లు