వారంతా స్నేహితులు.. కలిసి వ్యాపారం చేశారు.. నష్టాలు రావటంతో ఎవరిదారి వారు చూసుకున్నారు. అయితే పెట్టుబడి పెట్టిన వ్యక్తి తనకు రావాల్సిన మెుత్తం ఇవ్వాలని మిగిలిన వారిని అడిగాడు. వారి నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో పగను పెంచుకున్నాడు. ఎలాగైనా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. పథకం ప్రకారం లేని భూమిని సృష్టించాడు. దాన్ని అమ్మేందుకు మధ్యవర్తిత్వం చేస్తే.. భారీగా కమీషన్ వస్తుందని నమ్మించాడు. ఆ భూమిని కొనేందుకు పార్టీ దొరికిందనీ.. వారిని కలిసేందుకు రావాలని పిలిచాడు. ఆపై పథకం ప్రకారం వారిపై పెట్రోల్, శానిటైజర్‌ను పోసి నిప్పంటించి పారిపోాయడు.
అసలు ఏం జరిగిందంటే...
ధింటకుర్తి గంగాధర్, అతని భార్య నాగవల్లికుమారి ప్రస్తుతం పాత కార్లు కొని.. అమ్మే వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఈ భార్యాభర్తలిద్దరితో పాటు నిందితుడు వేణుగోపాలరెడ్డి, వజ్రాల శివరామకృష్ణారెడ్డి స్తిరాస్థి వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారంలో నష్టం రావటంతో.. ఎవరికి వారు విడిపోయి వ్యాపారం చేసుకుంటున్నారు. వారు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన నష్టంతో పాటు, తన దగ్గర తీసుకున్న అప్పు మెుత్తాన్ని సెటిల్ చేయమని వేణుగోపాలరెడ్డి.. గంగాధర్, శివరామకృష్ణారెడ్డిలను అడగ్గా.. వారు పట్టించుకోలేదు. దీంతో వారిపై పగను పెంచుకున్న వేణుగోపాలరెడ్డి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
ఓ పథకం ప్రకారం సోమవారం గంగాధర్, నావల్లి కుమారి, శివరామకృష్ణారెడ్డిలకు ఫోన్ చేసి సమావేశం కావాలని చెప్పాడు. నిందితుడు మాటలను నమ్మి, కారులో బయలుదేరిన గంగాధర్ దంపతులు, శివరామకృష్ణారెడ్డిని ఎక్కించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో పటమట స్క్రూబ్రిడ్జ్ వద్ద వేణుగోపాలరెడ్డిని కలుసుకున్నారు. అక్కడ నుంచి వారు తాడేపల్లిలో ఓ రెస్టారెండ్ వద్ద కాసేపు ఉన్నారు. అక్కడి నుంచి కాజా టోల్గేట్ వద్దున్న దాబా వద్ద కొంతసేపు చర్చించుకున్నారు. చివరిగా సాయంత్రం 5 గంటల సమయంలో విజయవాడ నోవాటెల్ సమీపంలోకి వచ్చారు. కారు సీటులో నిందితుడు వేణుగోపాలరెడ్డి, పక్క సీటులో శివరామకృష్ణారెడ్డి, వెనుక సీటులో గంగాధర్ దంపతులు కూర్చొని భూమి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో నిందితుడు వేణుగోపాలరెడ్డి పథకం ప్రకారం తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్, శానిటైజర్ కలిపిన సీసాను తెరిచి కారులో ఉన్నవారిపై పోశాడు. అనంతరం తన జేబులో ఉన్న లైటర్‌తో నిప్పు అంటించి కారు దిగి డోర్ లాక్ చేసేశాడు. చావండి అంటూ పెద్దపెద్ద కేకలు వేసుకుంటూ పారిపోయాడు.
నిందితుడి వేణుగోపాలరెడ్డిని ప్రత్యేక బృందాల సహాయంతో మంగళవారం నేతాజీ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేసినట్లు డీసీపీ హర్షవర్థన్ రాజు వివరించారు.