మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పరిధి అపురూప కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల నిర్లక్ష్యంతో ఓ బాలుడు స్విమ్మింగ్‌పూల్‌లో పడి మృతి చెందాడు.
అపురూప కాలనీలోని పాఠశాలలో ఓ మహిళ అటెండర్‌గా పని చేస్తోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభించడం వల్ల.. తన కుమారుడితో పాటు పాఠశాలకు విధులకు వెళ్లింది. తల్లి తన పనిలో తాను ఉండగా.. బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ ఫూల్లో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడం వల్ల మృతి చెందాడు.
బాలుడి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.