ఆన్లైన్ లోన్ యాప్‌లను నమ్మి ఎవరు మోసపోవద్దని జనగామ సిఐ మల్లేష్ సూచించారు. ఈ మధ్యకాలంలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా లోన్లు ఇప్పిస్తామంటూ ముఖ్యంగా యువతను అప్పు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తీసుకున్న అప్పులకు గాను వడ్డీ కి వడ్డీ వేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, ఇలాంటి అప్పుల నుంచి అందరూ దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్లైన్ లోన్ యాప్‌లలో రుణం తీసుకున్న వారి మొబైల్ ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లతో సహా రహస్య సమాచారమంతా సేకరిస్తారని సిఐ మల్లేష్ తెలిపారు. అప్పు సకాలంలో చెల్లించని పక్షంలో అప్పు తీసుకున్న వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు వందల నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ స్థానిక భాషలో బూతు పదజాలంతో వేధిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ కి చెందిన ఒక యువకుడు ఇదేవిధంగా మొబైల్ యాప్‌ల ద్వారా అప్పు తీసుకుని వేధింపులకు గురయ్యాడన్న ఆయన బాధితుని ఫిర్యాదు మేరకు ఐటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: లక్షణాలు లేవని నిర్లక్ష్యం చేస్తే.. తప్పదు భారీ మూల్యం