ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసు శాఖలో అవినీతి అధికారులు వరుసగా ఏసీబీకి దొరికిపోయారు. రెండు నెలల వ్యధిలోనే ముగ్గురు సీఐలు, ఒక ఎస్సై అరెస్టయ్యారు. కామారెడ్డిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం.. పోలీసు శాఖను కుదిపేస్తోంది. కామారెడ్డి సీఐ జగదీశ్.. క్రికెట్ బెట్టింగ్ విషయంలో సుధాకర్ అనే వ్యక్తిని బెయిల్ ఇచ్చేందుకు 5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.లక్షా 39 వేలు ఇచ్చిన సుధాకర్.. బెయిల్ వచ్చాక మిగతా డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. మిగతా డబ్బుల కోసం సీఐ జగదీశ్ వేధించడంతో.. ఈనెల 19న బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి అనిశా..
రంగంలోకి దిగిన అనిశా అధికారులు ఈ నెల 20 న జగదీష్ ఇంట్లో సోదాలు జరిపి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న కంఠేశ్వర్ సమీపంలోని ఓ బ్యాంకులోని అతని లాకర్‌లో 34లక్షల40 వేల నగదు, 9లక్షల12వేల విలువైన 182.5 గ్రాముల బంగారం, 15.7 గ్రాముల వెండి, పలు భూమి దస్తావేజులు లభించాయి.
తెరపైకి డీఎస్పీ పేరు..
కేసు విచారణలో భాగంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ పేరు తెరపైకి రావడంతో... ఆయణ్ని విచారించి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీకి బెట్టింగ్ కేసుతో సంబంధం లేదని తేల్చిన ఏసీబీ... ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా గుర్తించి ఆ దిశగా విచారణ సాగిస్తోంది. సీఐ జగదీశ్ విషయంలోనూ ఏసీబీ అదే పంథాలో సాగుతోంది. సీఐ జగదీశ్‌ను విచారించిన సమయంలోనే కామారెడ్డి పట్టణ ఎస్సై గోవింద్ పేరు తెరపైకి రాగా.. అప్పటి నుంచి ఆ ఎస్సై ఫోన్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు. రెండు రోజుల నుంచి ఎస్సై విధులకు వస్తుండగా.. అనిశా అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు సీఐ జగదీశ్, ఎస్సై గోవింద్, మరో మధ్యవర్తి సుజయన్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
2 నెలలు.. ముగ్గురు సీఐలు
సీఐ జగదీశ్ అరెస్టుతో కేవలం రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు సీఐలను అనిశా అరెస్టు చేసింది. ఈ ముగ్గురూ ఒకే బ్యాచ్‌కు చెందినవారు కావడం గమనార్హం. అక్టోబర్ 12న బాన్సువాడ రూరల్ సీఐ టాటాబాబు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ గుత్తేదారు కేసు విషయంలో అరెస్టు కాకుండా ఉండేందుకు ఓ వ్యక్తి వద్ద రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో... టాటాబాబును అధికారులు అరెస్టు చేశారు. అక్టోబర్ 31న నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ సీఐ పల్లె రాకేశ్ లంచం తీసుకున్న కేసులో ఏసీబీకి చిక్కాడు. భూమి విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా ఈనెల 20న కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
పోలీసు శాఖకు తలవంపులు
కేవలం 40రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ, బోధన్, కామారెడ్డి సీఐలు ఏసీబీకి చిక్కడం జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు సీఐలు, ఒక ఎస్సై అవినీతి కేసుల్లో అరెస్ట్ కావడం, ఓ డివిజనల్ స్థాయి అధికారిపై విచారణ కొనసాగుతుండటం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చి పెట్టింది.