ఓ ప్రైవేట్ పాఠశాల భవనాన్ని స్కూల్ యజమానులకు చెప్పకుండా కూల్చివేసిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఏం జరిగింది..
2010 సంవత్సరంలో ఐదుగురు సభ్యుల భాగస్వామ్యంతో లోకేశ్వరం మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలని ప్రారంభించారు. వారిలో నలుగురు టీచర్లు కాగా.. ఒకరు స్థల యజమాని. వీరిలో ఒకరు ఆ మధ్య కాలంలో చనిపోవటంతో.. అతని కుటుంబానికి తగిన న్యాయం చేసి అతనిని పాఠశాల వాటా నుంచి తొలగించారు. గడిచిన సంవత్సరం భూ యజమాని కూడా తన వాటాను తీసుకుని స్కూల్ స్థలానికి నెలనెల అద్దె తీసుకుంటున్నాడు.
ఎవరు లేని సమయంలో ..
మార్చ్ నెలలో లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో స్కూల్ యాజమాన్యం అక్టోబర్ వరకు అద్దె చెల్లించింది. మూడు నెలల నుంచి అద్దె చెల్లించట్లేదని డిసెంబర్‌లో పాఠశాల భవనం రేకులు తీసేశాడు. తాజాగా.. ఎవరు లేని సమయంలో పాఠశాల భవనాన్ని జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో పూర్తిగా తొలగించాడు.
విద్యార్థులు భవిష్యత్తు..
తమకు చెప్పకుండా స్థల యజమాని పూర్తిగా పాఠశాలని కూల్చి వేశాడని.. దీంతో అందులో చదువుకుంటున్న 220 మంది విద్యార్థులు భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని స్కూల్ యాజమాన్యం.. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ కూల్చివేతలో విద్యార్థుల ధ్రువపత్రాలు కనిపించట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదీ చదవండి:తెలంగాణలో కులవృత్తులకు పూర్వ వైభవం: మంత్రి తలసాని