అనుమానం పెనుభూతంగా మారి వివాహితను బలి తీసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన శ్రావణికి చొల్లేరు గ్రామానికి చెందిన వెంకటేష్‌తో గతేడాది వివాహం జరిగింది. వారి కాపురం కొద్ది కాలం పాటు సవ్యంగానే గడిచింది. ఆ తరువాత శ్రావణి గర్భవతి అని తెలియగానే వెంకటేష్.. ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఆ బాధలు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. బాబు పుట్టాడు. అయినా కూడా భార్యకు తరుచూ ఫోన్ చేసి వేధించేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. ఈ నెల 10న చేనేత రంగుల రసాయనం తాగి ఆత్మహత్యకు యత్నించింది.
18 రోజుల పాటు చికిత్స పొంది
అనంతరం ఆమెను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా 18 రోజుల పాటు చికిత్స పొందింది. బాధితురాలు ఇక బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చడంతో శ్రావణి తనను అత్తగారింటికి తీసుకెళ్లాలని కోరింది. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మృతి చెందింది. దీంతో ఆమె అత్త, భర్తపై మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఇంటి ముందు నిరసన తెలిపారు. పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రోడ్డు దాటుతుంటే సిమెంట్ మిక్సర్ ట్రక్ ఢీ.. మహిళ మృతి