హైదరాబాద్ కోఠి ట్రూప్ బజార్లోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధి ట్రూప్ బజార్లోని ఓ భవంతి మొదటి అంతస్తులోని డీకే సానిటరీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే షాప్ యజమాని గౌలిగూడా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచాడు. సకాలంలో చేసుకున్న సిబ్బంది పక్క షాపులకు వ్యాపించకుండా నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
భయాందోళనలు..
గడ్డితో సానిటరీ వస్తువులను ప్యాక్ చేసి ఉండడంతో... దుకాణంలోని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. దుకాణంలో పని చేసే వారు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
కోఠి, అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏంజే మార్కెట్ నుంచి ట్రూప్ బజార్ మీదుగా కోఠి వెళ్లే వాహనాలను కొద్ది సేపు దారి మళ్లించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.