మల్కాజిగిరి మాజీ ఏసీపీ నర్సింహా రెడ్డి అక్రమాస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. బినామీ పేర్లతో మాదాపూర్లో ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన కేసులో అనిశా అధికారులు 8 మందిని అరెస్టు చేశారు.
మాదాపూర్లోని సర్వే నెంబర్ 64లో 1960 గజాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని 2016లో నలుగురు వ్యక్తులు తమదని నకిలీ పత్రాలు సృష్టించారు. 2018లో ఈ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఏసీపీ నర్సింహారెడ్డి తన భార్య పేరుతో 490 గజాల భూమిని కొనుగోలు చేయగా.. మరో నలుగురు వ్యక్తులు కలిసి అదే సర్వే నెంబర్లోని 3 ప్లాట్లు కొనుగోలు చేశారు. నర్సింహారెడ్డి తెరవెనుక ఉండి.. ప్రభుత్వ భూమిని తన బినామీల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అదే భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించాడు.
నర్సింహారెడ్డి, తన బినామీల పేర్ల మీద ఉన్న 1960 గజాల స్థలం మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అనిశా అధికారులు లెక్కగట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వారం క్రితమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వంద కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.
ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తే మాదాపూర్ ప్రభుత్వ వ్యవహారం బయటపడింది. నర్సింహారెడ్డిని ఈనెల 5 నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆయనను ప్రశ్నిస్తే మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు