ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్రోడ్లో వాల్మీకి కొండ వద్ద టెంపో బోల్తా పడింది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తుండగా వాల్మీకి కొండ వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వారు కర్ణాటక చిత్రదుర్గ జిల్లా చలకెరి గ్రామానికి చెందిన పర్యటకులుగా తెలుస్తోంది. మృతులు కె.ఎస్.రమేశ్, అమృతవాణి, శ్రీనివాసులు, మధురాక్షమ్మ, గాయత్రమ్మ, శ్వేత, రామలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఆరా.. చంద్రబాబు దిగ్భ్రాంతి
టెంపో ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.