మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సాదుల యాదగిరి, దుంపల ఎల్లం, మెదక్ పట్టణానికి చెందిన స్కైలాబ్, నాగరాజు మంగళవారం సాయంత్రం చేపలు పట్టేందుకు మంజీరా నది పాయల వద్దకు వెళ్లారు. ఆ సమయానికి వరద ఉద్ధృతి తక్కువగా ఉంది. వాళ్లు రాత్రి అక్కడే బొడ్డే మీద నిద్రపోయారు. పొద్దున లేచి చూసే సరికి మంజీరా నది పాయలో వరద ప్రవాహం పెరిగింది.
చేపల వేటకు వెళ్ళిన నలుగురు బయటకు వచ్చే పరిస్థితి లేక అక్కడే చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఇంఛార్జి ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, కొల్చారం తహసీల్దార్ ప్రదీప్, మెదక్ రూరల్ సీఐ పాలవెళ్ళి, కొల్చారం, హవేలీ ఘన్పూర్ ఎస్సై శ్రీనివాస్ గౌడ్, శేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఎగువన సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసేయించారు. ఆ తరువాత జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు నది పాయలో వరద ప్రవాహం తగ్గేవరకు వేచి ఉండాలని నిర్ణయించారు. గజ ఈతగాళ్ల సాయంతో బొడ్డే మీదికి వెళ్లి అక్కడ చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు తీసుకొచ్చారు.
మంజీరా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.