నిషేధిత విదేశీ సిగరెట్లు (ఫారిన్ సిగరేట్ల)ను విక్రయిస్తున్న ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ , చంద్రయాణ గుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. దాదాపు 30 కార్టన్ల మేర సిగరేట్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 15లక్షల విలువ..
పట్టుబడ్డ సిగరేట్ల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ధనార్జనే లక్ష్యంగా నిషేధిత విదేశీ సిగరెట్ల వ్యాపారం కోసం హైదరాబాద్ కాలపత్తర్ ప్రాంతానికి చెందిన అస్లం ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
శాలిబండకు చెందిన సయ్యద్ ఇలియాసుద్దీన్, బహదూర్పురా వాసి మహమ్మద్ సమీర్ని లారీ డ్రైవర్, క్లినర్గా ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం వీరి ద్వారా నిషేధిత సిగరెట్లను నగరంలోకి తెప్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
పాన్ షాపులు, దుకాణాల్లో..
ఈ క్రమంలో సిగరెట్లను పాన్ షాపులు, దుకాణాల్లో అమ్ముతూ లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ పోలీసులు ముఠాపై దాడి చేసి ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లారీతో పాటు సిగరెట్ కార్టన్లను చంద్రయాణ గుట్ట పోలీసులకు అప్పగించారు.