విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 20 మందికిపైగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ భారీ క్రేన్‌ను దశాబ్దం క్రితం హిందుస్థాన్ షిప్‌యార్డ్ కొనుగోలు చేసింది. దీని నిర్వహణను ఇటీవలే పొరుగు సేవల సిబ్బందికి అప్పగించారు.
సీఎం జగన్ ఆరా
విశాఖ హెచ్‌ఎస్‌ఎల్ ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. అధికారుల నుంచి ప్రమాదం వివరాలను తెలుసుకున్నారు. తక్షణ చర్యలకు విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌కు సీఎం ఆదేశించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
షిప్‌యార్డులో ప్రమాదం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో అక్కడ 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోందని వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రమాదంపై స్పందించిన లోకేశ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ... మృతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.