అమెరికా దళాల చేతిలో ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ అతి దారుణంగా హతమయ్యాడు. ఆ తర్వాత బకర్ వారసుడిగా అబి ఇబ్రహీం అల్- హషీమి-అల్ ఖురేషీని ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ. అయితే ఖురేషీ ఎక్కుడున్నాడన్నది ఇంకా రహస్యంగా ఉండటం.. ఉగ్రసంస్థ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని జిహాదీ బృందం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"ఖురేషీ ఇస్లామిక్ స్టేట్ అధినేత, ఇస్లామిక్ న్యాయ కమిటీ (షారియా)కి పెద్ద అని తప్ప.. ఇతర వివరాలు మాకు పూర్తిగా తెలియదు. అసలు ఖురేషీ బతికే ఉన్నాడా అనే ప్రశ్న మాకూ ఉత్పన్నమవుతోంది".
-హిషాం అల్-హషేమి, ఇరాక్ నిపుణుడు
బాగ్దాదీ అనూహ్య మరణం అనంతరం సందిగ్ధంలో పడిన ఐసిస్.. పరిస్థితులు తమ చెయ్యి దాటి పోలేదని ప్రపంచానికి చెప్పడానికే ఖురేషీని తమ వారసుడిగా ప్రకటించి ఉండొచ్చని కొందరు విశ్వసిస్తున్నారు.
నిజమైన వారసుడిని అన్వేషించేందుకే.. ఖురేషీ పేరును పావుగా వాడుకోవడానికి ఐసిస్ నిర్ణయించిందనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సందిగ్ధతకు స్వస్తి పలకాలంటే ఖురేషీ తన గుర్తింపును బహిరంగపరచాలని అరబ్ విశ్వవిద్యాలయ నిపుణుడు జీన్- పియోర్ ఫలియు తెలిపారు.
అంతర్గత కలహాలు...!
బాగ్దాదీ నాయకత్వం జిహాదీల్లో ఎంతో స్ఫూర్తినింపింది. ఆ తర్వాత అతని వారసుడిగా నియమితుడైన ఖురేషీ.. ఇప్పటి వరకు సరైన నాయకత్వాన్ని అందించలేదు. దానితో పాటు అంతర్గత నాయకత్వ సవాళ్లను అధిగమించాలంటే తనపై ఉన్న అనుమానాలను ఖురేషీ తొలిగించాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
"ఖురేషీ నాయకత్వంపై ఇప్పటికే పలువురి జిహదీలు విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు పాలించే ప్రాంతం(కాలిఫెట్) లేకుంటే... మత గురువు(కాలీఫ్) అవసరం ఏం ఉందని వారు అంటున్నారు."
-డానియల్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయ నిపుణుడు.
ఐసిస్ నాయకుడిగా తనను తాను నిరుపించుకోవడానికి ఎంతో సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు నాయకుడి గురించే ఏం తెలియనప్పుడు.. ఐసిస్ దారి ఎటువైపు ఉంటుందనేది తెలుసుకోవడం ఎంతో కష్టం అంటున్నారు.
బాగ్దాదీ హతం..
సిరియా వాయువ్య రాష్ట్రం ఇడ్లిబ్లో అమెరికా దళాలు జరిపిన ఆపరేషన్లో బాగ్దాదీ హతమయ్యాడు. యూఎస్ దళాల నుంచి రక్షించుకోవడానికి ఓ సొరంగంలోకి వెళ్లి.. తన ఇద్దరు పిల్లలను కాల్చిన అనంతరం ఆత్మాహుతి చేసుకున్నాడు.