అమెరికా-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. అమెరికా సైనిక స్థావరాలపై వరుస క్షిపణి దాడులతో విరుచుపడ్డ అనంతరం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ముందు ఎంతమాత్రం తగ్గేది లేదని విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దాడులకు పాల్పడితే.. ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
"అమెరికా ముందు ఎంతమాత్రం తగ్గేది లేదు. ఒకవేళ అమెరికా దాడులు చేస్తే.. తగిన ప్రతిస్పందన ఇస్తామన్న విషయం వారికి తెలియాలి. వారు తెలివైన వారైతే ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు. నా దృష్టిలో... ఈ ప్రాంతంలోని దేశాల నుంచి అమెరికాకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంది. వారు సులేమానీని హతమార్చారు. ఇందుకు ప్రతీకారం అమెరికాను ఈ ప్రాంతం నుంచి లేకుండా చేయడమే. ఇరాన్ నుంచి నిజమైన, చివరి ప్రతిస్పందన ఇదే అవుతుంది."
-హసన్ రౌహానీ, ఇరాన్ అధ్యక్షుడు