ఆగస్టులో సౌదీ చమురు కేంద్రాలపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ దేశ భద్రతా రంగాన్ని బలోపేతం చేయడానికి అమెరికా సహాయం చేయనుంది. ఈ మేరకు తమ దేశానికి చెందిన 200 దళాలను సౌదీలో మోహరించనున్నట్టు అగ్రరాజ్య రక్షణశాఖ ప్రకటించింది.
దళాలతో పాటు భూతలం మీద నుంచి ఆకాశంవైపు ప్రయోగించగలిగే పాట్రియాట్ క్షిపణులను సౌదీకి పంపనుంది అమెరికా. వీటిలో ఓ బ్యాటరీ సహా నాలుగు సెంటినల్ రాడార్ల వ్యవస్థ ఉంటుంది.
వీటితోపాటు అవసరమైతే మరో రెండు పాట్రియాట్ బ్యాటరీలు, ఒక థాడ్(టీహెచ్ఏఏడీ) బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పంపడానికి సిద్ధం చేస్తున్నట్టు పెంటగాన్ ప్రతినిధి జొనాథన్ హఫ్మన్ తెలిపారు.
"సౌదీ అరేబియాపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రాంతీయ భాగస్వామ్యానికి, మధ్య ఆసియా దేశాల భద్రత, స్థిరత్వానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యలు స్పష్టం చేస్తాయి."
--- జొనాథన్ హఫ్మన్, పెంటగాన్ ప్రతినిధి.
సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడి.. ఇరాన్ పనేనని అమెరికా పలుమార్లు ఆరోపించింది. ఈ ఆరోపణలు నిరాధారమని ఇరాన్ కొట్టిపారేసింది.