ఇజ్రాయెల్-యూఏఈ మధ్య తొలి వాణిజ్య విమానం వచ్చే వారం ప్రయాణించనుందని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ విమానం.. అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను అబుదాబికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.
తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇజ్రాయెల్-యూఏఈ ఇటీవలే అంగీకరించాయి. ఈ చారిత్రక ఒప్పందానికి అమెరికా సాక్ష్యంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-యూఏఈ మధ్య టెలిఫోన్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
తాజా విమాన ప్రయాణ వార్త ఇరు దేశాలను మరింత ఉత్సాహపరిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, జాతీయ భద్రత సలహాదారు రాబర్డ్ ఓబ్రెయిన్ నేతృత్వంలోని అమెరికా బృందం, ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్, అంతరిక్షం, ఆరోగ్యం, బ్యాంకింగ్ రంగ నిపుణులు.. ఈ విమానంలో యూఏఈకి ప్రయాణిస్తారని సమాచారం.
సౌదీ స్వాగతించినట్టేనా?
ఇజ్రాయెల్-యూఏఈ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందాన్ని అనేక దేశాలు స్వాగితించాయి. గల్ఫ్ దేశాల్లో అత్యంత ముఖ్యమైన సౌదీ అరేబియా మాత్రం మనస్ఫూర్తిగా ఈ ఒప్పందాన్ని స్వాగతించినట్టు కనపడటం లేదు.
ఈ నేపథ్యంలో తాజా విమాన ప్రయాణ అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్ నుంచి యూఏఈకి వెళ్లాలంటే సౌదీ గగనతలాన్ని వినియోగించుకోవాల్సిందే. అయితే ఇప్పటివరకు దీనిపై సౌదీ ఇంకా స్పందించలేదు. అది జరగకపోతే.. యెమెన్ వంటి ప్రమాదకర మార్గాలను విమాన ప్రయాణానికి ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి:- ఇజ్రాయెల్-యూఏఈ డీల్‌తో ఎవరికి లాభం?