US Attack In Syria: అమెరికా భద్రతా దళాలు చుట్టుముట్టగా.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ కీలక నేత అబూ ఇబ్రహీం తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో అబూ ఇబ్రహీంతో పాటు అతడి కుటుంబంలోని పిల్లలు, మహిళలు దుర్మరణం చెందారు. అమెరికా బలగాలకు చిక్కకూడదనే అబూ ఇబ్రహీం తనను తాను పేల్చేసుకున్నాడని అగ్రరాజ్య రక్షణ అధికారులు తెలిపారు. కీలక ఉగ్రవాదిని పట్టేందుకు అమెరికా కమాండోలు కొన్ని నెలలుగా ప్రణాళిక రచించగా దాడిని అగ్రరాజ్య అధ్యక్షుడు అసాంతం తిలకించారు.
అదీ... సిరియా-టర్కీ సరిహద్దుకు సమీపంలోని అత్మేహ్ పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రం. అక్కడ ఐసిస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఇబ్రహీం అల్ హషిమీ-అల్- ఖురేషీ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఐసిస్ కీలక నేత అబూ బకర్ అల్ బగ్దాది హతమయ్యాక అతని స్థానంలోకి అబూ ఇబ్రహీం వచ్చాడు. అప్పటి నుంచి ఆ ఉగ్రవాది అంతానికి పంతం పట్టిన అమెరికా దళాలు పక్కా ప్రణాళికతో అతడు నివసిస్తున్న భవనాన్ని చుట్టుముట్టాయి. వరుసగా హెలీకాఫ్టర్లు తన భవనంపై చక్కర్లు కొట్టడం గమనించిన ఖురేషీ సూసైడ్ బాంబర్‌గా మారి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో కనీసం 13 మంది మరణించారని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని సిరియా అధికార వర్గాలు తెలిపాయి.
నెలలుగా నిఘాపెట్టి..
ఐసిస్ కీలక నేత అబూ ఇబ్రహీం అల్ హషిమీ-అల్- ఖురేషీని హతమార్చేందుకు అమెరికా చాలా నెలలుగా ప్రణాళిక రచిస్తోంది. అత్మేహ్ పట్టణ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఖురేషీ ఉన్నాడని పక్కాగా నిర్ధారించుకున్న అమెరికా కమాండోలు.. అతడు చాలా అరుదుగా ఇంటి నుంచి బయటకు వస్తున్నాడని తెలుసుకున్నారు. చుట్టుపక్కలు ఇళ్లు కూడా ఉండగా.. అమాయకులకు ఎలాంటి ప్రాణ హాని కలగకుండా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్ మిల్లీతో జరిగిన సమావేశంలో అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ ఈ ఆపరేషన్‌కు ఆమోద ముద్ర వేశారు. డిసెంబర్‌లో ఈ ఆపరేషన్ ప్రణాళిక ప్రారంభంకాగా ఖురేషీ ఉన్నట్టు నిర్ధారించుకున్న భవనంపై మెరుపు దాడి చేయాలని అమెరికా ప్రత్యేక దళాలు ప్రణాళిక రచించాయి.
బాంబులు అమర్చిన చొక్కా ధరించి..
అనుకున్నట్లుగానే అమెరికా కమాండోలు అబూ ఇబ్రహీం ఇంటిపై మెరుపుదాడి చేశారు. ఈ క్రమంలో ఇరువైపులా రెండు గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. దాడుల్లో అమాయకులెవరూ చనిపోరాదని బైడెన్ ఆదేశించడం వల్లే వైమానిక దాడులు జరపలేదని తెలుస్తోంది. దాడికి ముందు మహిళలు, పిల్లలు భవనం నుంచి బయటకు రావాలని అమెరికా సేనలు హెచ్చరించాయి. అనంతరం మూడు అంతస్తుల భవనంపై దిగాయి. అగ్రరాజ్య సేనలు రెండో అంతస్తుకు చేరుకోగానే అబూ ఇబ్రహీం భార్య, ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు కాల్పులకు దిగారు. వారిని మట్టుబెట్టిన అనంతరం అమెరికా కమాండోలు మూడో అంతస్తుకు చేరుకుంటుండగానే అబూ ఇబ్రహీం బాంబులు అమర్చిన చొక్కా ధరించి తనను తాను పేల్చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి కుటుంబ సభ్యులు ఈ దాడిలో మరణించారు.
పిరికిపంద చర్య..
ఖురేషీ మరణం ఐసిస్ ఉగ్ర సంస్థకు గట్టి దెబ్బని అమెరికా అధికారులు తెలిపారు. అబూ ఇబ్రహీం అత్మాహుతి దాడి వల్లే సామాన్యులు మరణించారని పెంటగాన్ తెలిపింది. మృతదేహాల డీఎన్ఏ విశ్లేషించాకే అబూ ఇబ్రహీం మృతిని ధ్రువీకరించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. దాడుల అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా దాన్ని ధ్వంసం చేశారు. అమెరికా బలగాల ప్రత్యేక ఆపరేషన్‌ను వైట్‌హౌస్ సిచ్యువేషన్ రూమ్ నుంచి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ వీక్షించారు. అబూ ఇబ్రహీం ఆత్మహత్యను పిరికిపంద చర్యగా అభివర్ణించిన బైడెన్.. ఉగ్రవాద నిరోధక చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సిరియాలో అమెరికా మెరుపు దాడి- 13 మంది పౌరులు బలి