అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు అద్దం పట్టే ఫొటో ఇది. ముష్కరుల ఆక్రమణలతో యుద్ధ వాతావరణం నెలకొన్న అఫ్గాన్‌లో (afghanistan news) ఇప్పుడిప్పుడే రోజువారీ కార్యకలాపాలు తిరిగి మొదలవుతున్నాయి. తాజాగా కొన్ని ప్రావిన్స్‌లలో విశ్వవిద్యాలయాలు తెరుచుకోగా.. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా ఇలా తరగతి గదుల్లో పరదాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్థానిక విలేకరులు కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ప్రజా ప్రభుత్వం నుంచి ముష్కరుల చేతుల్లోకి వెళ్లిన అఫ్గానిస్థాన్‌లో (afghan taliban) భారీ మార్పులే చోటుచేసుకుంటున్నాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పుకుంటూ వచ్చిన తాలిబన్లు.. చేతల్లో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ ఎడ్యుకేషన్ అథారిటీ విద్యాసంస్థలకు ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు యూనివర్శిటీలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నిఖాబ్ ధరించాలని తాలిబన్లు ఆదేశించారు. వేర్వేరు తరగతి గదుల్లో బోధించాలని చెప్పారు. అది కుదరకపోతే కనీసం వారి మధ్య కర్టెన్ వేయాలని ఆదేశించారు.
అంతేగాక, అమ్మాయిలకు పురుషులు విద్యాబోధన చేయరాదని స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వయసులో పెద్దవారైన పురుష టీచర్లు వారికి బోధించాలని తెలిపారు. ఇక తరగతులు పూర్తయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేసారి బయటకు వెళ్లకూడదట. ఒకే సమయంలో వెళ్తే బయట వారు మాట్లాడుకునే అవకాశముంటుందని దానిపైనా ఆక్షలు విధించారు. ముందు అబ్బాయిలంతా బయటకు వెళ్లిపోయిన తర్వాత అమ్మాయిలను పంపించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి : తాలిబన్ల 'వేడుక'కు చైనాకు ఆహ్వానం!