అంతరిక్ష రంగంలో మరో కీలక ప్రాజెక్టును చేపట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సన్నద్ధమవుతోంది. 2024లో చంద్రుడిపైకి మానవరహిత వ్యోమనౌకను పంపించనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఇందులో భాగంగా 'రషీద్' పేరుతో దేశీయంగా ఉత్పత్తి చేసే రోవర్‌ను జాబిల్లి ఉపరితలంపై దించనున్నారు.
ఇందుకు సంబంధించి యూఏఈ ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. 10 కిలోల బరువు ఉండే ఈ రోవర్ రెండు హై రిజల్యూష్ కెమెరాలు, ఓ మైక్రోస్కోపిక్ కెమెరా, థర్మల్ ఇమేజరీ కెమెరా, ప్రోబ్, ఇతర పరికరాలను వెంట మోసుకెళుతుందని చెప్పారు.
కొత్త ప్రదేశంలో..
గతంలో చందమామపై మానవులు ఎప్పుడూ ప్రయోగాలు జరపని ప్రదేశంలో రోవర్ తన అన్వేషణను కొనసాగిస్తుందని పేర్కొన్నారు రషీద్. యూఏఈ ప్రయోగం విజయవంతమైతే.. జాబిల్లిపై వ్యోమనౌకను సురక్షితంగా దించిన నాలుగో దేశంగా రికార్డులకెక్కుతుంది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్, చైనా ఈ ఘనత సాధించాయి.
భారత్ గతేడాది చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా రోవర్‌ను చంద్రుడిపై సురక్షితంగా దించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. యూఏఈ గతేడాది తమ దేశం నుంచి వ్యోమగామిని తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపించింది. అంగారక గ్రహంపై పరిశోధనలు జరిపేందుకు గాను ఈ ఏడాది జులైలో ఓ ప్రోబ్‌ను కూడా ప్రయోగించింది.