అంతరిక్ష పరిశోధనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అద్భుత విజయాన్ని సాధించింది. అంగారక గ్రహ కక్ష్యలోకి మంగళవారం విజయవంతంగా ఒక వ్యోమనౌకను పంపింది. అరబ్ దేశాలకు ఇదే తొలి గ్రహాంతర యాత్ర. రోదసిలో దాదాపు 7 నెలల పాటు.. 30 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'అమల్' అనే ఈ వ్యోమనౌక నిర్దేశిత రీతిలో అంగారక గ్రహానికి చేరువైంది. మంగళవారం.. ఇంజినీర్లు సంకేతాలు పంపి, ఈ వ్యోమనౌకలోని ప్రధాన ఇంజిన్లను 27 నిమిషాల పాటు అత్యంత కచ్చితత్వంతో మండించారు. కీలకమైన ఈ విన్యాసంతో అమల్ వేగం తగ్గి, అరుణ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది.
ఈ మేరకు సంకేతం రావడానికి 15 నిమిషాలు పట్టడంతో దుబాయ్‌లోని అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లలో ఉత్కంఠ మొదలైంది. వ్యోమనౌక సాఫీగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించినట్లు సంకేతాలు రావడం వల్ల వారిలో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. అక్కడి వాతావరణ పరిస్థితులపై అమల్ పరిశోధనలు జరుపుతుంది. మరోవైపు చైనాకు చెందిన తియాన్వెన్-1 బుధవారం అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది.
ఈ నెల 18న అమెరికాకు చెందిన 'పర్సివరెన్స్' రోవర్ ఆ గ్రహ ఉపరితలంపై కాలుమోపుతుంది. ఈ వ్యోమనౌకలన్నీ గత ఏడాది జులైలో భూమి నుంచి బయలుదేరాయి.
ఇదీ చూడండి: మార్స్ యాత్రకు కౌంట్‌డౌన్- రోవర్ విశేషాలు తెలుసా?