ఇరాన్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 120 ఫారన్‌హీట్ దాటింది. దీంతో ఖుజెస్తాన్ రాష్ట్రంతో పాటు ఇరాన్ వ్యాప్తంగా తీవ్ర నీటి కొరత వేదిస్తోంది. ప్రభుత్వం కూడా చేతులెత్తేసే పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు.
జులై 15 నుంచి ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 8మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలుడు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు.. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు హక్కుల కార్యకర్తలు. వందల మందిని అరెస్ట్ చేసినట్లు ఆరోపించారు.
ఖుజెస్థాన్, అహ్వాజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 50 డిగ్రీల సెల్సియస్(122 ఫారన్‌హీట్) ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అక్కడి వాతావరణ విభాగం తెలిపింది.
గత మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కరువు తాండవం చేస్తోంది. నీటి ఎద్దడితో ప్రజల గొంతు ఎండుతోంది. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుందని, ప్రజలు దాహంతో ఉన్నారని నినాదాలు చేశారు ఆందోళనకారుల.
ఈ క్రమంలోనే ఇరాన్‌లోని నీటి ఎద్దడిపై ప్రపంచానికి తెలియకుండా అడ్డుకునే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాల సేవలపై ఆంక్షలు విధించడం ఇందుకు కారణం.
నీటి సమస్యను తీర్చాలి
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్ మిచెల్ బాచెలెట్.. ఇరాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులపై బలగాలను ఉసిగొల్పటానికి బదులుగా.. నీటి సమస్యపై పోరాడాలని కోరారు. కాల్పులు జరపటం, ప్రజలను అరెస్ట్ చేయటం వల్ల ఇంకా ప్రజల్లో ఆవేశాలు పెరుగుతాయే తప్పా ప్రయోజన లేదన్నారు.
ఇదీ చూడండి: 'ప్రజల్లో విద్వేష వ్యాప్తి - 33 న్యూస్ సైట్లపై నిషేధం!'