ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీని అంతమొందించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. పశ్చిమాసియాతో పాటు ప్రస్తుత యూఎస్ రాజకీయాల్లోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చే అవకాశముంది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయని యూఎస్ వార్తా ఛానెళ్లతో పాటు చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే సులేమానీని మట్టుబెట్టే ప్రక్రియ సాహసోపేతమైనందున గత అమెరికా అధ్యక్షులెవరూ ఇందుకు ప్రయత్నించలేదు. కానీ, ట్రంప్ మాత్రం ఆ దిశగా ముందడుగు వేశారు. మరి సులేమానీ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో భవిష్యత్ నిర్ణయించనుంది. ఈ ఏడాదిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓటర్లపైనా దీని ప్రభావం పడే అవకాశముంది.
యుద్ధం కాదు.. ప్రతీకారమే
ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవట్లేదని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అలాగే అక్కడ పరిపాలనా యంత్రాంగంలో మార్పులు తమ దేశాధ్యక్షుడి ఆకాంక్ష కాదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెబుతూనే ఉన్నారు. అమెరికాతో యుద్ధానికి దిగితే తాము గెలిచే అవకాశాలు దాదాపు లేనందున ఇరాన్ కూడా యూఎస్‌తో కయ్యం కోరుకోదు. అయితే సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని గట్టిగా చెబుతోంది. అందులో భాగంగానే ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై అణుక్షిపణులతో దాడి చేసింది.
డ్రోన్ కూల్చివేతతో రగడ మొదలు
గతేడాది అమెరికా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్ కూల్చివేతకు బదులుగా ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని తమ దేశ బలగాలకు ట్రంప్ అప్పట్లో ఆదేశాలిచ్చారు. అయితే చివరి నిమిషంలో ప్రతీకార వాంఛను విరమించుకున్నారు. ఆ తర్వాత సౌదీ చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడి చేసింది. గతేడాది డిసెంబరు 27న కిర్కుక్లోని మిలిటరీ బేస్ క్యాంపుపై దాడి చేసి.. అమెరికన్ కాంట్రాక్టర్‌ను హతమార్చింది. ఇందుకు ప్రతిగా కతైబ్ హిజ్బుల్లాపై దాడికి ట్రంప్ ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. కతైబ్ హిజ్బుల్లాపై ట్రంప్ దాడిని వ్యతిరేకిస్తూ.. కొందరు నిరసనకారులు బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి చేశారు. ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన ట్రంప్.. అమెరికా పౌరులు, ఆస్తులపై భవిష్యత్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందనే అనుమానంతోనే సులేమానీని చంపాలని ఆదేశాలిచ్చారు. అప్పుడే సులేమానీతో పాటు ఇరాక్ షియా మిలీషియా కమాండర్ మెహ్దీ అల్ ముహందిస్ను మట్టుబెట్టింది అమెరికా.
ఇరాన్ ఆరాధ్యదైవం సులేమానీ
పశ్చిమాసియాలో గత రెండు దశాబ్దాలపాటు జరిగిన దాడుల్లో సులేమాని హస్తముందని చాలాకాలంగా పశ్చిమాసియా పరిస్థితులను పరిశీలిస్తున్న కిమ్ ఘట్టాస్ తెలిపారు. సులేమాని అడుగు ప్రాంతాలను దాటి కూడా వెళ్లిందని వివరించారు. 2012లో దిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్త కారుపై జరిగిన దాడి వెనుక సులేమానీ ఉన్నారని కిమ్ వెల్లడించారు. అలాగే ఇరాన్లో వంటగ్యాస్ ధరలను 200 శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ గత నవంబరులో నిరసనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఆందోళనలకు దిగిన 1000 మందిని అతి కిరాతకంగా చంపించారు సులేమానీ. అయినప్పటికీ చాలా మంది ఇరానీలకు సులేమానీ ఆరాధ్యదైవం. ఎందుకంటే ఆయన అమెరికాకు, ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కాబట్టి.
ట్రంప్ పోటీదారుకు సవాలే!
ఇరాక్‌లో చాలామంది అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే సులేమానీని చంపేందుకు ట్రంప్ ఆదేశాలిచ్చారు. సులేమానీ లేని ప్రపంచం ఎంతో బాగుంటుందని డెమోక్రాట్లు కూడా ఇందుకు మద్దతు పలికారు. అయితే చట్టపరంగా అది ఎంతవరకు సమంజసమోనని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ చర్య.. తమను యుద్ధానికి రమ్మని పిలిచినట్లుగా ఉందని ఇరాన్ భావించే అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు సులేమానీపై ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయంతో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిని కాస్త ఒత్తిడిలోకి నెట్టేయనుంది. వైద్య సేవలు, స్థానిక సమస్యలతో పాటు కఠిన విదేశీ విధానాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తి వాగ్దానం చేసేందుకు దారితీస్తుంది.
సులేమానీని హంతకుడు అనడాన్ని డెమొక్రాట్ సెనెటర్ ఎలిజబెత్ వార్రెన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. ఆయనను ఒక ప్రభుత్వ అధికారిగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ట్రంప్ పనితీరుకు పరీక్షలాంటివని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రక్షణ కార్యదర్శి లియోనీ పానెట్టా అభిప్రాయపడ్డారు. ట్రంప్ గత మూడేళ్లలో అమెరికా మిత్ర దేశాలను అపహాస్యం చేశారు. పోటీదారులను అగౌరపరిచారు. సొంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(నిఘా వర్గాలు)లను ఖండించారు. అయితే వీటన్నింటినీ మించి సులేమానీ హత్య ట్రంప్‌నకు ఎలా సహకరిస్తుందో చూడాలి.
(రచయిత - సీమా సిరోహీ)