ఇజ్రాయెల్లో కొన్ని వారాలగా నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా యుద్ధరూపు సంతరించుకుంటున్నాయి! భీకర దాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా తాజాగా దద్దరిల్లాయి. గాజా నుంచి 500లకు పైగా రాకెట్లను ఇజ్రాయెల్ పైకి హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించగా.. వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడ్డాయి. దాడుల్లో 28 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్లో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒకరు భారతీయ మహిళ కావడం గమనార్హం.
జెరుసలెంలోని ఆల్-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్న హమాస్ ఉగ్రవాదులు.. సోమవారం సాయంత్రమే దాడులను ప్రారంభించారు. 500లకు పైగా రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడుల్లో అష్కెలాన్ నగరంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 10 మంది గాయపడ్డారు.
ఇదీ చూడండి: సరిహద్దులో ఉద్రిక్తత- రంగంలోకి అదనపు సైన్యం
మరోవైపు ఇజ్రాయెల్ బలగాలు పదుల సంఖ్యలో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడ్డాయి. ఈ విధ్వంసంలో 28 మంది పాలస్తీనియన్లు దుర్మరణం పాలయ్యారు. 152 మంది గాయపడ్డారు. మృతుల్లో 10 మంది చిన్నారుల ఓ మహిళ ఉన్నట్లు సమాచారం. మరణించినవారిలో కనీసం 16 మంది హమాస్ ముష్కరులున్నారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
గాజా నగరంలోని ఓ అపార్టమెంట్పై జరిగిన దాడిలో తమ కమాండర్లు ముగ్గురు మరణించారని హమాస్ ఉగ్రవాద ముఠా వెల్లడించింది.
'దాడుల తీవ్రత పెంచుతాం'
ఇజ్రాయెల్ సైనిక చర్యతో గాజా ఉగ్రవాదులకు గట్టి దెబ్బ తగిలిందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహ అన్నారు. అయితే ఈ పోరాటం కొంతకాలం కొనసాగుతుందని హెచ్చరించారు. హమాస్ ముష్కరులపై దాడుల తీవ్రతను పెంచాలని తాము నిర్ణయించినట్లు నెతన్యాహ తెలిపారు.
దాడుల్లో భారతీయ మహిళ మృతి
అష్కెలాన్ నగరంలో చనిపోయిన ఇద్దరు మహిళల్లో.. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 31 ఏళ్ల సౌమ్య ఒకరు. కేరళలో ఉన్న తన భర్తతో వీడియోకాల్ మాట్లాడుతుండగానే.. ఆమె ఇంటిపై రాకెట్ పడింది.
ఇదీ చూడండి: రాకెట్లతో రెచ్చిపోయిన పాలస్తీనా ఉగ్రవాదులు-24 మంది మృతి