ఇరాన్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దేశంలోని ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బుషెర్కు 45 కిలోమీటర్ల దూరం, 38 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది అమెరికా.
కాలమీ పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. భూకంపం దృష్ట్యా కొన్ని పర్వత ప్రాంతాల్లోని రహదారులను మూసివేశారు.
తరచూ భూకంపాలు..
ప్రధాన టెక్టానిక్ ప్లేట్లపై ఇరాన్ భూభాగం ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2017 నవంబర్‌లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 620 మంది మరణించారు.
2003లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 31,000 మంది, 1990 లో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 40వేల మంది మరణించారు.
అణు పరీక్షపై అమెరికా అనుమానాలు..
1,000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బుషెర్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా నిర్మించింది. 2013లో ఇరాన్‌కు అధికారికంగా అప్పగించింది. చమురు, సహజవాయువుపై భారాన్ని తగ్గించుకునేందుకు మరో 20 అణు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రచించింది ఇరాన్.
ఈ విషయంలోనే అమెరికాతో ఇరాన్ వివాదం కొనసాగుతోంది. అణు పరీక్షలకు ఇరాన్ ప్రయత్నిస్తోందని అమెరికా అనుమానం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది.
ఇదీ చూడండి: అఫ్గాన్ మారణహోమంలో లక్ష మంది పౌరులు మృతి!