సౌదీ అరేబియాలో జరుగుతున్న గల్ఫ్ అరబ్ దేశాల నేతల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమ్మద్ ఆల్ తానీ హాజరయ్యారు. ఖతార్‌పై కొనేళ్లుగా కొనసాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ ప్రకటించింది. దీంతో తమీమ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. సౌదీ చేరుకున్న తమీమ్‌కు ఘనస్వాగతం పలికారు ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్.
అందుకే ఆంక్షలు
ఇస్లామిక్ గ్రూపులకు మద్దతివ్వడం, ఇరాన్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం వల్ల ఖతార్‌పై 2017లో ఆంక్షలు విధించాయి నాలుగు అరబ్ దేశాలు. అప్పటి నుంచి అరబ్ దేశాలతో ఖతార్‌కు ద్వైపాక్షిక, సామాజిక సంబంధాలు తెగిపోయాయి.
అయితే అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సాయంతో కువైట్ మధ్యవర్తిత్వంతో అరబ్ దేశాలు- ఖతార్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. దీంతో సౌదీ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలో అల్-ఉలాలో జరుగుతున్న గల్ఫ్ అరబ్ నాయకుల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి మూడేళ్ల తర్వాత తమీమ్ హాజరయ్యారు.
ఇదీ చూడండి: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దు