లెబనాన్లో కొద్ది రోజుల క్రితం భారీ పేలుడు జరిగి 150 మందికిపైగా మరణించిన ఘటనపై ఆ దేశ రాజధాని బీరుట్లో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు ప్రజలు. నగరంలోని ప్రధాన కూడలిలో వేల సంఖ్యలో చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. రాజకీయ నేతల అవినీతే.. పేలుడుకు కారణమైందని.. పార్లమెంటు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో నిరసనలు తెలిపారు.
పేలుడు జరిగిన తర్వాత ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగటం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ.. నమూనా అంత్యక్రియలు నిర్వహించారు.
హింసాత్మకం..
పార్లమెంటు ఎదుట పెద్ద ఎత్తున చేరిన ఆందోళనకారుల్లో కొందరు.. భద్రతా బలగాలపై రాళ్లు విసిరారు. బారికేడ్లు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. అనంతరం ఓ కారుకు నిప్పుపెట్టారు నిరసనకారులు.
ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలపాలని, ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించొద్దని కోరారు పోలీసులు.
ఇదీ చూడండి: ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!