ఇరాక్ అనుబంధ దళం కటేబ్ హిజ్బుల్లాపై విమర్శలు గుప్పించారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ఇరాకీలు అమెరికా బలగాలకు దూరంగా ఉండాలని హెచ్చరించటంపై తీవ్రంగా స్పందించారు. ఇరాన్ దుశ్చర్యలను ఎండగట్టాలని కోరుతూ ట్వీట్ చేశారు. ఇరాక్ ప్రభుత్వం ఏమి చేయాలో ఇరాన్ చెప్పటం ద్వారా ఇరాకీలను ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ చర్యలతో ఇరాక్ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.
"అమెరికన్లతో కలిసి పని చేసే మంచి వారైన ఇరాకీలను కటేబ్ హిజ్బుల్లా దుండగులు బెదిరింపులకు పాల్పడుతూ.. దూరంగా వెళ్లమంటున్నారు. ఇరాన్ చర్యలు ఇరాక్ ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఇరాక్ ప్రజలు ఇరాన్ నుంచి విముక్తులు కావాలని కోరుకుంటున్నారు. ఇరాక్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ఇటీవల దహనం చేయడమే ఇందుకు నిదర్శనం. ఇది ఇరాన్‌పై ఇరాకీల ఆగ్రహాన్ని తెలియజేస్తుంది."
-మైక్ పాంపియో, యూఎస్ విదేశాంగ మంత్రి
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్య అనంతరం పశ్చిమాసియాలో యుద్ధ వాతవరణం నెలకొంది. తాజాగా అమెరికా సైనికులే లక్ష్యంగా రాకెట్లతో ఇరాన్ దాడికి పాల్పడగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా ఇరు దేశాల మధ్య ఈ ఘటన తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. సులేమానీ హత్యకు ఇరాన్ అనుబంధ దళం కటేబ్ హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనింది. ఇరాకీలు అమెరికా బలగాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.