అమెరికా- ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ సమయంలో ఆ దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెంచే సంఘటన సిరియా గగనతలంలో చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి లెబనాన్ రాజధాని బీరుట్‌కు వెళుతున్న తమ పౌరవిమానంపైకి అమెరికా ఎఫ్-15 జెట్ దూసుకొచ్చిందని.. దీంతో చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారని ఇరాన్ ఆరోపించింది. సంఘటన దృశ్యాలను ఇరానియన్ టీవీ ప్రసారం చేసింది. అకస్మాత్తుగా ఎఫ్-15 జెట్.. ప్రయాణికుల విమానానికి దగ్గరగా రావడం వల్ల పైలట్.. ఒక్కసారిగా ఎత్తును పెంచి తగ్గించాల్సి వచ్చిందని.. దీంతో ప్రయాణికులు గాయపడ్డారని ఇరాన్ వెల్లడించింది. అమెరికా మాత్రం.. సిరియాలోని తమ సైనిక స్థావరం మీదుగా వెళుతున్న విమానాన్ని ప్రొటోకాల్‌లో భాగంగానే 1000 మీటర్ల దూరం నుంచి తమ ఎఫ్-15 జెట్ పరిశీలించిందని చెప్పింది.
'అమెరికా విమానాన్ని తరిమేశాం'
బ్లాక్ సీ ప్రాంతంలో తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన అమెరికా గూఢచర్య విమానాన్ని సుఖోయ్-27 యుద్ధ విమానంతో తరిమేశామని రష్యా వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.