Lebanon Explosions in mosque: లెబనాన్ టైర్ నగరంలోని ఓ శరణార్థుల శిబిరంలో భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనా హమాస్ వర్గాల కోసం నిల్వ చేసిన ఆయుధాలు పేలిపోయినట్లు తెలుస్తోంది. కనీసం 12 మంది మరణించి ఉంటారని లెబనాన్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.
పేలుడు ధాటికి శిబిరం దెబ్బతింది. అందులోని మిగిలిన శరణార్థులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్సులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. రంగంలోకి దిగిన అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.
మసీదులో ఆయుధాలు!
ఓ డీజిల్ ట్యాంకర్లో తొలుత మంటలు చెలరేగాయని ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి. అనంతరం పాలస్తీనా తీవ్రవాద బృందాలకు చెందిన ఓ మసీదుకు మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. దీంతో అక్కడ నిల్వ చేసిన కొన్ని ఆయుధాలు పేలిపోయాయని చెప్పారు.
లెబనాన్లో వేలాది మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రధానంగా 12 శిబిరాల్లో వీరు తలదాచుకుంటున్నారు.
ఇదీ చదవండి: చాపకింద నీరులా కరోనా- 'ఒమిక్రాన్'తో ఆంక్షల్లోకి దేశాలు!