లెబనాన్ రాజధాని బీరుట్లో మంగళవారం జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 100కు చేరింది. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ రెడ్ క్రాస్ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ విధ్వంసం..
నౌకాశ్రయం కేంద్రంగా జరిగిన పేలుడుకు రాజధాని నగరం వణికిపోయింది. సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవహించింది. పోర్టు నుంచి ఇప్పటికీ పొగ వస్తోంది. పేలుడు తీవ్రతకు పోర్టులో మంటలు వ్యాపించాయి. భీకరమైన పేలుడు ధాటికి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు తర్వాత సమీప ప్రాంతంలో వినాశకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీరుట్కు 200 కి.మీ దూరంలో ఉన్న సైప్రస్ వరకు పేలుడు శబ్దం వినిపించింది. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లపైనా పేలుడు ప్రభావం కనిపించింది. పేలుడు ధాటికి సమీప ప్రాంతంలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
కారణాలేంటి?
ఈ విధ్వంసకర పేలుడుకు కారణాలు తెలియరాలేదు. అయితే.. కొంతకాలం క్రితం ఓడల నుంచి జప్తు చేసి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఈ ఘటన సంభవించిందని అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల్లో సోడియం నైట్రేట్ ఉందని స్థానిక మీడియా పేర్కొంది. టపాసులు నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు చెబుతోంది.
ఇదీ చూడండి: లెబనాన్ రాజధానిలో భారీ పేలుడు