చక్రవర్తి అబ్దుల్లా-2 సోదరుడు, జోర్డాన్ మాజీ యువరాజు హంజా బిన్ హుస్సేన్ తనను గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. జోర్డాన్‌లో పలువురు ప్రముఖులు సహా రాజకుటుంబంలోని వివిధ వ్యక్తులను ఇటీవల అక్కడి చక్రవర్తి అరెస్టు చేయించారని చెప్పారు. ఇందులో భాగంగానే తనను, తన భార్యాబిడ్డలనూ గృహనిర్బంధం చేశారని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.
"నా స్నేహితులు సహా ఎంతో మందిని అరెస్టు చేశారు. నా భద్రతను తొలగించారు. ఇంటర్నెట్, ఫోన్ లైన్స్‌ను తొలగించారు. శాటిలైట్ ఇంటర్నెట్ సాయంతో నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. బహుశా ఇకపై నేను ఎవరితోనూ మాట్లాడలేకపోవచ్చు."
- హంజా బిన్ హుస్సేన్, జోర్డాన్ మాజీ యువరాజు.
వీడియోలో ఉన్నది ప్రిన్స్ హంజా బిన్ హుస్సేనే అని అంతర్జాతీయ న్యాయవాది మాలిక్ ఆర్.దహ్లాన్ ధ్రువీకరించారు. తాను ఏ కుట్రలో భాగస్వామిని కానని, ఏ విదేశీ సమూహాల్లో భాగం కాదని చెప్పేందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నట్లు హంజా బిన్ తెలిపారు.
అబ్దుల్లాకు సౌదీ అరేబియా, అమెరికా మద్దతు..
దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల కింద తన సోదరుడు హంజా బిన్ హుస్సేన్‌ను అబ్దుల్లా ప్రశ్నిస్తున్నారని వస్తున్న వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. జోర్డాన్ చక్రవర్తి కింగ్ అబ్దుల్లా-2.. తమకు కీలకమైన భాగస్వామి అని పేర్కొంది. అబ్దుల్లాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది.
సౌదీ అరేబియా కూడా అబ్దుల్లాను సమర్థించింది. జోర్డాన్ భద్రత విషయంలో అబ్దుల్లా తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.
ఇదీ చూడండి:ఆన్లైన్లో 50 కోట్ల ఫేస్బుక్ యూజర్ల డేటా